![]() |
![]() |

సినిమా రంగంలో ఎప్పుడు ఏ చిత్రం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో ఎవరూ ఊహించలేరు. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తాయనే నమ్మకాన్ని కొన్ని సినిమాలు పూర్తిగా మార్చేస్తుంటాయి. అలా దాదాపు ఏడేళ్ల క్రితం, ఎలాంటి ముందస్తు అంచనాలు, హడావిడి లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన సంచలన చిత్రం 'అంధాధున్'.
2018 అక్టోబర్‌లో విడుదలైన ఈ బాలీవుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కేవలం కథ మరియు స్క్రీన్‌ప్లే బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి నిరూపించింది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. కేవలం32 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఏకంగా 456 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు 14 రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా చైనా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలవగా అతని నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా దక్కింది. అతనితో పాటు టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఒక అంధుడైన పియానో ప్లేయర్ చుట్టూ తిరిగే మలుపుల కథ ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టింది.
Also read: Dhurandhar 2: ఓటిటిలోకి వచ్చినా తగ్గని జోరు.. 100 రోజుల థియేటర్ రన్ తో మరో రికార్డు
థియేటర్లలోనే కాకుండా, ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఇప్పటికీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. ఒక మర్డర్ మిస్టరీకి బ్లాక్ కామెడీని జోడించి, క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా కథని నడిపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సాధించిన భారీ విజయం కారణంగానే దీనిని తెలుగులో నితిన్ హీరోగా 'మాస్ట్రో' పేరుతో, తమిళంలో ప్రశాంత్ హీరోగా 'అంధాగన్' పేరుతో మరియు మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో 'భ్రమమ్' పేరుతో రీమేక్ చేశారు. ఒరిజినల్ కథలోని సస్పెన్స్, మలుపులు ఎంత పవర్‌ఫుల్ అనేదానికి ఈ రీమేక్‌లే నిదర్శనం. నేటికీ ఓటీటీలో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ల లిస్ట్‌లో 'అంధాధున్' టాప్‌లో నిలవడానికి కారణం ఆ స్క్రీన్‌ప్లే మ్యాజిక్కే.

![]() |
![]() |